ఒక్కటి మాత్రం నిజం.. టీడీపీ మాత్రం మళ్లీ అధికారంలోకి రాదు!: నాగబాబు

30-05-2020 Sat 13:34
  • ప్రజలకు టీడీపీ చేసిందేమీ లేదు
  • అందుకే ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు
  • భ్రమల నుంచి టీడీపీ నేతలు బయటపడాలి
TDP never come to power again says Nagababu

జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు మరోసారి టీడీపీని టార్గెట్ చేశారు. తదుపరి ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే, టీడీపీ మాత్రం కచ్చితంగా అధికారంలోకి రాదనేది తన నమ్మకమని అన్నారు. ఎందుకంటే తెలుగుదేశం తన హయాంలో రాష్ట్ర ప్రజలకు ఊడబొడిచింది ఏమీ లేదని విమర్శించారు. అభివృద్ధి అంతా టీవీ, పేపర్లలోనే కనిపించిందని... నిజంగా టీడీపీ చేసింది చాలా తక్కువ అని ఎద్దేవా చేశారు.

ఏమీ చేయనందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలని నాగబాబు అన్నారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ మేమే వస్తాం అనే భ్రమల్లోంచి బయటపడాలని చెప్పారు. మేము కలల్లోనే జీవిస్తాం అని అంటే చేసేదేమీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితిని మానసికశాస్త్రంలో హెల్యూజినేషన్స్ అని అంటారని... 'ఆల్ ది బెస్ట్ ఫర్ హెల్యూజినేషన్స్..' అన్నారు నాగబాబు.