బాధ్యత గల పౌరుడిగా నా అభిప్రాయం చెప్పా: హైకోర్టు నోటీసులపై గుడివాడ అమర్నాథ్

30-05-2020 Sat 13:38
  • డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును తప్పుపట్టిన పలువురు వైసీపీ నేతలు
  • 93 మందికి నోటీసులు పంపిన హైకోర్టు
YSRCP MLA Gudivada Amar comments on AP High Court

వైజాగ్ డాక్టర్ సుధాకర్ పై పోలీసుల దాడి కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై వైసీపీకి చెందిన పలువురు విమర్శించారు. ఈ నేపథ్యంలో, కోర్టు ధిక్కరణ కింద వీరందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తొలి విడతలో 49 మందికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, రెండో విడతలో మరో 44 మందికి నోటీసులు పంపింది. వీరిలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు నోటీసులు పంపినట్టు తన స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడని... నోటీసులు ఇంకా తనకు అందలేదని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా తాను హైకోర్టు తీర్పుపై స్పందించలేదని, బాధ్యత గల పౌరుడిగా తన అభిప్రాయాన్ని చెప్పానని తెలిపారు. హైకోర్టు తనను పిలిచి బోనులో నిలబెట్టి ప్రశ్నించినా... ఇదే సమాధానం చెపుతానని వ్యాఖ్యానించారు.