కమల్ సినిమాలో పాయల్ కి ఛాన్స్!

30-05-2020 Sat 12:27
  • ఐటెం పాటలు చేస్తున్న టాప్ హీరోయిన్లు 
  • ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తున్నారు
  • 'భారతీయుడు 2'లో పాయల్ ఐటెం పాట
Payal Rajputh to play item song

గత కొన్నాళ్లుగా టాప్ హీరోయిన్లు కూడా కొన్ని సినిమాలలో ఐటెం సాంగులలో మెరుస్తున్నారు. మంచి పారితోషికం ఆఫర్ చేయడం వల్ల చాలామంది వీటికి ఓకే చెప్పేస్తున్నారు. పైగా మూడు నాలుగు రోజుల్లో ఈ పాట పూర్తయిపోతుంది, ఎక్కువ రోజులు కూడా ఇవ్వక్కర్లేదు. అందుకే, చిన్నా, పెద్దా హీరోయిన్లంతా వీటికి మొగ్గుచూపుతున్నారు.

ఈ క్రమంలో 'ఆర్ ఎక్స్ 100' భామ పాయల్ రాజ్ పుత్ కి కూడా ఇలాంటిదే ఓ మంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. పైగా, కమలహాసన్ సరసన స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ఆమెకు వచ్చింది. గతంలో తాను రూపొందించిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు'కి ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కమలహాసన్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొంత కాలంగా జరుగుతోంది. ఇందులో ఓ ఐటెం సాంగు ఉండడంతో, దానికి పాయల్ ని తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, పాయల్ కి కోలీవుడ్ ప్రవేశం ఈ సినిమా ద్వారానే జరుగుతున్నట్టు భావించాలి!