దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ

30-05-2020 Sat 11:54
  • కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తోంది
  • భారత ఓటర్లు పూర్తి మెజారిటీతో మాకు అధికారం కట్టబెట్టారు
  • దేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే దేశ ప్రజల కల
  • ఆర్టికల్ 370ని రద్దు చేయడం దేశ సమైక్యతను పెంచింది
  • ప్రజలకు లబ్ధి చూకూర్చే అనేక  చట్టాలు రూపొందించాం
Modi Penned a letter to my fellow citizen

కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తోన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఏడాది క్రితం ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైందని ఆయన చెప్పారు. భారత ఓటర్లు పూర్తి మెజారిటీతో తమకు అధికారం కట్టబెట్టారని ఆయన తెలిపారు.

తమ పాలనలో కోట్లాది మందికి ఉచిత గ్యాస్‌తో పాటు విద్యుత్ కనెక్షన్లు అందించామని, దేశంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించామని చెప్పారు. దేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే దేశ ప్రజల కల అని ఆయన చెప్పారు. 'అందరితో కలిసి అందరి వికాసం కోసం' నినాదం ఇచ్చిన ఉత్సాహంతో భారత్ అన్ని రంగాలలో ముందడుగు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం దేశ సమైక్యతను పెంచిందన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు శతాబ్దాల కాలంగా సాగుతున్న చర్చకు మంచి ముగింపునిచ్చిందని చెప్పారు.  ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేశామని, పౌరసత్వ చట్టానికి సవరణ చేశామని చెప్పారు. తమ పాలనలో త్రివిధ దళాల అధిపతి కోసం కొత్త పదవిని సృష్టించామని తెలిపారు.

దేశంలో 50 కోట్ల పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే అనేక  చట్టాలు రూపొందించామని తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్ విజృంభిస్తూ భారత్‌కు కూడా చేరిందన్నారు. భారత్ లోకి కరోనా ప్రవేశించినప్పుడు ప్రపంచానికి మన దేశం ఒక సమస్యగా మారుతుందని చాలామంది ఆందోళన చెందారని గుర్తు చేశారు. అయితే, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు.