శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది మృత్యువాత.. ఆకలి వల్ల కాదన్న రైల్వే!

30-05-2020 Sat 09:57
  • ఆకలి, వేడి, దీర్ఘకాలిక జబ్బుల వల్ల మృతి
  • మే 1-27 మధ్య 3,840 శ్రామిక్ రైళ్లను నడిపిన రైల్వే
  • సొంత రాష్ట్రాలకు 50 లక్షల మంది తరలింపు
80 Migrant workers died in Shramik Special Trains

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. మే 9 నుంచి 27 మధ్య నడిపిన ఈ రైళ్లలో ఇప్పటి వరకు 80 మంది మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడైంది.

వీరంతా ఆకలి, వేడి, దీర్ఘకాలిక జబ్బుల కారణంగా మరణించినట్టు రైల్వే తెలిపింది. మే 1 నుంచి 27వ తేదీ మధ్య రైల్వే 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపింది. ఈ రైళ్ల ద్వారా 50 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చింది. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

అయితే, రైళ్లలో భోజనం దొరక్క మాత్రం ఎవరూ మరణించలేదన్నారు. మరణించిన వారిలో నార్త్‌ఈస్టర్న్ రైల్వేలో 18 మంది, నార్త్ సెంట్రల్ జోన్‌లో 19 మంది, ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో 13 మంది ఉన్నట్టు వివరించారు.