ఫోర్బ్స్ జాబితాలో 34 స్థానాలు ఎగబాకిన కోహ్లీ.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడు!

30-05-2020 Sat 07:45
  • రూ. 196 కోట్లతో 66వ స్థానంలో నిలిచిన కోహ్లీ
  • రూ. 801 కోట్ల సంపాదనతో అగ్రస్థానంలో రోజర్ ఫెదరర్
  • టాప్-100లో 35 మంది బాస్కెట్ బాల్ క్రీడాకారులే
Virat Kohli only cricketer to be named in Forbes Highest earning athletes list

ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాలో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి మరోమారు చోటు దక్కింది. రూ. 196 కోట్ల ఆదాయంతో కోహ్లీ ఈ జాబితాలో 66వ స్థానంలో నిలిచాడు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క కోహ్లీకి మాత్రమే చోటు దక్కడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే కోహ్లీ ఈసారి 34 స్థానాలు ఎగబాకి 66వ స్థానానికి చేరుకున్నాడు.

స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ కెరియర్‌లోనే తొలిసారిగా రూ. 801 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచాడు. ఓ టెన్నిస్ ఆటగాడు ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటినాకు చెందిన లియొనెల్ మెస్సీలు రెండు మూడు స్థానాల్లో నిలిచారు. రొనాల్డో ఆదాయం రూ. 794 కోట్లు కాగా, మెస్సీ ఆదాయం రూ. 786 కోట్లు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్-100 జాబితాలో 35 మంది బాస్కెట్ బాల్ ఆటగాళ్లే ఉండడం గమనార్హం.