Telangana: జూన్ 5 తర్వాత హైదరాబాదులో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు?

  • కార్యాలయాలు తెరుచుకున్నా బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు
  • కండక్టరు లేకుండా బస్సులు తిప్పే ప్రతిపాదనకు ప్రభుత్వం నో
  • తొలుత కరోనా కేసుల్లేని ప్రాంతాలకే పరిమితం
TSRTC  decided to run city buses

హైదరాబాదు నగరంలో  మరో వారం రోజుల్లో సిటీ బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే జిల్లా సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పుడు పూర్తిస్థాయి జాగ్రత్తలతో సిటీ బస్సులను కూడా నడపాలన్న ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 సడలింపుల్లో భాగంగా చాలా వరకు కార్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే, ఆఫీసులకు చేరుకునేందుకు రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను తిప్పాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే జూన్ 5 నాటికి సిటీ బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.  

పూర్తిస్థాయి కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కండక్టరు లేకుండా, స్టేజీల వద్ద టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించగా, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. కండక్టరుతోనే బస్సులు నడపాలని యోచిస్తోంది. నిల్చునే ప్రయాణాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.

అయితే, జిల్లా బస్సుల్లా కాకుండా సిటీ బస్సుల్లో అది సాధ్యం కాదని అంటున్నారు. ఒక్కసారిగా ఎక్కే వారిని కండక్టర్లు నియంత్రించలేరని చెబుతున్నారు. కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న ప్రాంతాలకు కాకుండా తొలుత వేరే ప్రాంతాల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం రోజుల్లో తెలంగాణలో సిటీ బస్సులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News