15 వేల మంది ఉద్యోగులపై వేటేసిన కార్ల తయారీ సంస్థ రెనో!

30-05-2020 Sat 07:00
  • ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్టు చెప్పిన రెనో
  • వచ్చే మూడేళ్లలో రూ. 16,800 కోట్ల మేర వ్యయం తగ్గించుకోవాలని లక్ష్యం
  • ఒక్క ఫ్రాన్స్‌లోనే 4,600 మంది ఉద్యోగుల తొలగింపు
Renault to axe 15000 jobs worldwide

కరోనా దెబ్బకు కుదేలవుతున్న కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని చూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపులో తాము కూడా ఏమాత్రం తీసిపోమని నిరూపించింది ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 15 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించి, షాకిచ్చింది.

ఫ్రాన్స్‌లో 4,600 మందిని, ఇతర దేశాల్లో 10 వేల మందికి పైగా తొలగిస్తున్నట్టు నిన్న ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో దాదాపు రూ. 16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఈ కోతలు అమలు చేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, గతేడాది ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన రెనో..  2024 నాటికి ఈ సంఖ్యను 33 లక్షలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.80 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పుడు వీరిలో 15 వేల మందిని తొలగించాలని నిర్ణయించింది.