GDP: దారుణంగా పడిపోయిన దేశ జీడీపీ.. 11 ఏళ్ల కనిష్ఠానికి చేరిక!

  • 2019-20లో 4.2 శాతంగా నమోదైన వృద్ధి రేటు
  • మార్చి చివరి వారంలో ఆర్థిక వ్యవస్థకు రూ. 1.4 లక్షల కోట్ల నష్టం
  • తలసరి ఆదాయంలో మాత్రం పెరుగుదల
GDP Growth Rate slows in q4

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. కేవలం 4.2 శాతం మాత్రమే నమోదై 11 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం 6.1 శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈసారి ఏకంగా 4.2 శాతం పడిపోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి.

ఆర్థిక సంవత్సరం చివరి వారమైన మార్చి 25 నుంచి 31 వరకు దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడం ఇందుకు ఒక కారణం. వినియోగం పెట్టుబడులు తగ్గడం మరో కారణం. మార్చి 25 నుంచి 31 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థకు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల నష్టం జరిగిందన్నది ఓ అంచనా. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైనట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) నిన్న విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 5.7 శాతంగా ఆర్థిక వృద్ధి నమోదు కావడం గమనార్హం.

నిజానికి 2019-20 ఏడాదిలో వృద్ధి రేటు 5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఎన్ఎస్‌వో కూడా ఇలాంటి అంచనాకే వచ్చింది. అయితే, లాక్‌డౌన్ ప్రభావం కారణంగా అంచనాలకు ఏమాత్రం అందకుండా జీడీపీ దారుణంగా పతనమైంది.

మరోవైపు, ద్రవ్యలోటు కూడా ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం దేశ ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతానికి పెరిగింది. నిజానికి ఈ ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, అంతకంటే ఎక్కువే నమోదైంది. మరోపక్క, తలసరి ఆదాయం మాత్రం పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. జీడీపీ లెక్కల ప్రకారం.. 2018-19లో రూ. తలసరి ఆదాయం రూ. 1,26,521గా ఉంటే రూ. 2019-20లో రూ. 1,34,226కు పెరిగి 6.1 శాతం వృద్ధి నమోదైంది.

More Telugu News