తెలంగాణలో కరోనా విజృంభణ... ఒక్కరోజే 169 కేసులు వెల్లడి

29-05-2020 Fri 22:16
  • నలుగురి మృతి
  • జీహెచ్ఎంసీ పరిధిలో 82 మందికి కరోనా
  • బయటి నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్
Corona cases increased in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల నుంచి ప్రవాసులు రావడం, ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో ఇవాళ ఒక్కరోజే 169 కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. దాంతో మరణాల సంఖ్య 71కి పెరిగింది. స్థానికంగా 100 కేసులు నమోదు కాగా, బయటి నుంచి వచ్చినవారిలో 69 మంది కరోనా బారినపడ్డట్టు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 82 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. స్థానికంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 2008కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 973 మంది చికిత్స పొందుతున్నారు.