ఏపీకి, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు నడుస్తున్నాయి: బీజేపీ నేత రామ్ మాధవ్

29-05-2020 Fri 20:53
  • వైసీపీ ఏడాది పాలనకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ మాధవ్
  • జగన్ సర్కారు దృఢ సంకల్పంతో పనిచేస్తోందని కితాబు
  • వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడి
Ram Madhav praises CM Jagan on his one year rule

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన, తొలుత వైసీపీ సర్కారుకు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి దిశగా జగన్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని కితాబిచ్చారు. ఏపీకి, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు నడుస్తున్నాయని, పార్లమెంటు సమావేశాల్లోనూ వైసీపీ ఎంపీలు బీజేపీ, ఎన్డీయేకి మద్దతుగా నిలుస్తున్నారని, కేంద్రం పథకాలకు సహకరిస్తున్నారని వెల్లడించారు.

విభజన చట్టంలోని హామీలనే కాకుండా, అంతకుమించి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా ఏపీకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్టు స్వయంగా ప్రధాని మోదీ కూడా చెప్పారని రామ్ మాధవ్ వెల్లడించారు. అటు, 15వ ఆర్థిక సంఘం కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీకి ఎంత ఎక్కువ ఇవ్వగలుగుతామో అంతమేరకు ఇచ్చేందుకు సకారాత్మకంగా ఆలోచన చేసిందని రామ్ మాధవ్ చెప్పారు. అంతేగాకుండా, సీఎం జగన్ కు మద్దతుగా కొన్నివ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడ కొన్ని వివాదాలు ఉన్నా, వాటికి ముఖ్యమంత్రిని జవాబుదారీగా చేయాల్సిన పనిలేదని అన్నారు.