మిడతలతో ప్రమాదం పొంచి ఉంది.... ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో జాగ్రత్త: డీజీసీఏ హెచ్చరిక

29-05-2020 Fri 20:04
  • భారత్ లో మిడతల కలకలం
  • అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం తప్పదన్న డీజీసీఏ
  • అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు ఉత్తర్వులు
DGCA issues alert to all airlines about locust swarm

కరోనాతో సతమతమవుతున్న భారత్ ను ఇప్పుడు రాకాసి మిడతలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా దృష్టి సారించింది. మిడతలతో ప్రమాదం పొంచి ఉందని, ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పైలెట్లు అప్రమత్తంగా ఉండాలని డీజీసీఏ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది. అన్ని విమానయాన సంస్థలకు ఉత్తర్వులు పంపింది.

సాధారణంగా ఈ మిడతలు తక్కువ ఎత్తులో సంచరిస్తుంటాయని, దాంతో విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో వీటితో ముప్పు ఉండే అవకాశాలున్నాయని డీజీసీఏ వివరించింది. విమానం ఓ మిడతల గుంపులోంచి వెళుతున్నప్పుడు, విమానంలోకి గాలి ప్రవేశించే పోర్టుల్లో ఈ మిడతలు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే మిడతలు రాత్రివేళల్లో ప్రయాణించకపోవడం కాస్త ఊరట కలిగించే అంశమని డీజీసీఏ వెల్లడించింది.