చిరంజీవి, నాగార్జునను లీడ్ చేయమని కేసీఆర్ చెప్పారు: సి.కల్యాణ్

29-05-2020 Fri 18:05
  • ఇది నిర్మాతలు, దర్శకుల సమావేశం
  • కార్యక్రమాన్ని చిరంజీవి, నాగార్జున లీడ్ చేయాలని కేసీఆర్ కోరారు
  • చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టాలని తలసాని చెప్పారు
KCR requested Chiranjeevi and Nagarjuna to take lead says C Kalyan

సినిమా కార్మికులకు సాయం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. చిరంజీవి నివాసంలో కొందరు సీనీ ప్రముఖులు ఈరోజు సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో కల్యాణ్ మాట్లాడుతూ, సీసీసీ తరపున పరిశ్రమకు చెందిన మరెవరైనా (పోస్టర్లు అంటించేవారు తదితరులు) మిస్ అయ్యారా? అనే అంశంపై చర్చించామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సాయం అందించాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.

మొన్నటి మీటింగ్ కు బాలయ్యను పిలవకపోవడానికి కారణం ఏమిటో నిన్ననే చెప్పానని... ఇది రన్నింగ్ లో సినిమాలు ఉన్న నిర్మాతలు, దర్శకుల మీటింగ్ అని కల్యాణ్ తెలిపారు. ఆ కార్యక్రమాన్ని చిరంజీవి, నాగార్జున లీడ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారని... అందుకే వారిని ముందు పెట్టామని చెప్పారు. చిరంజీవి నివాసంలో మీటింగ్ పెట్టమని మంత్రి తలసానే చెప్పారని అన్నారు. భూములు పంచుకునేందుకు మీటింగ్ పెట్టుకున్నారా అని బాలయ్య ఏ ఫ్లోలో, ఎందుకు అన్నారో తనకు తెలియదని చెప్పారు. దీనికి సమాధానం చెప్పలేనని అన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని అందరినీ కోరుతున్నానని విన్నవించారు.