Ajit Jogi: అజిత్ జోగి కన్నుమూత.. ఐఏఎస్ నుంచి సీఎం వరకు ప్రస్థానం!

  • రాయపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • అజిత్ జోగి వయసు 74 సంవత్సరాలు
  • చత్తీస్ ఘడ్ తొలి సీఎంగా చరిత్ర పుటల్లో అజిత్ జోగి
Chhattisgarh first CM Ajit Jogi dies at 74

చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన... రాయపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. అజిత్ జోగి మరణ వార్తను ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 20 ఏళ్ల వయసున్న చత్తీస్ గఢ్ రాష్ట్రం కుటుంబ పెద్దను కోల్పోయిందని ట్విట్టర్ లో ఆయన వ్యాఖానించారు. తానే కాకుండా, రాష్ట్ర ప్రజలందరూ ఒక తండ్రిని కోల్పోయారని చెప్పారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అజిత్ జోగి... గత వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. మూడు వారాలుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. 2000వ సంవత్సరంలో అవతరించిన చత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన... జనతా కాంగ్రెస్ చత్తీస్ గఢ్ అనే సొంత పార్టీని స్థాపించారు.

1946 ఏప్రిల్ 29న బిలాస్ పూర్ లో అజిత్ జోగి జన్మించారు. భోపాల్ లోని మౌలానా అజాద్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఐఏఎస్ కు ఎంపికయ్యారు. భోపాల్, ఇండోర్ జిల్లాలకు కలెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేశారు. గతంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారాయన. అప్పటి నుంచి చక్రాల కూర్చీలోనే వుండి రాజకీయాలను నడిపారు.

More Telugu News