బాలకృష్ణ తన మానసిక స్థితిని ఓసారి చెక్ చేయించుకోవాలి: వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు

29-05-2020 Fri 16:16
  • ఇటీవల బాలయ్య ఘాటు వ్యాఖ్యలు
  • తమ ప్రభుత్వం ఎలా పడిపోతుందో బాలయ్యే చెప్పాలన్న ఇక్బాల్
  • వైసీపీకి 151 సీట్లున్న సంగతి తెలియదా అంటూ ఎద్దేవా
YSRCP MLC Iqbal fires on Nandamuri Balakrishna comments

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ప్రముఖుల సమావేశాలపై చేసిన కామెంట్స్ ను పక్కన పెడితే, ఐదేళ్ల కంటే ముందే టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ 'మహానాడు'లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఆగ్రహానికి గురి చేశాయి.

తాజాగా, వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ బాలయ్య కామెంట్స్ ను తప్పుబట్టారు. ఐదేళ్ల కంటే ముందే టీడీపీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ అంటున్నారని, 151 సీట్లు ఉన్న తమ పార్టీ అధికారం నుంచి ఎలా పడిపోతుందో ఆయనే చెప్పాలని ఇక్బాల్ వ్యాఖ్యానించారు.

తమ పార్టీకి విలువలు ఉన్నాయి కాబట్టి సరిపోయిందని, లేకపోతే ఈపాటికి టీడీపీ ఖాళీ అయ్యేదని అన్నారు. ఏదేమైనా, బాలయ్య ఓసారి తన మానసిక స్థితిని చెక్ చేయించుకోవాలని ఇక్బాల్ హితవు పలికారు. సినీ పరిశ్రమ చర్చలకు తనను పిలవలేదన్న బాధ ఆయనలో కనిపిస్తోందని తెలిపారు.