GVL Narasimha Rao: తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవని వైసీపీ ప్రభుత్వం గ్రహించాలి: జీవీఎల్

  • ఎస్ఈసీగా రమేశ్ కుమార్ ను కొనసాగించాలన్న హైకోర్టు
  • అన్నీ తామై వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించరాదన్న జీవీఎల్
  • రమేశ్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని హితవు
GVL comments on High Court judgement over SEC issue

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తెరగాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు.

ఎన్నికల కమిషనర్ హోదాలో రమేశ్ కుమార్ కూడా ఏ రకంగా, ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికలు వాయిదా వేసే వరకు రమేశ్ కుమార్ తీరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు ఆరోపణలున్నాయని, ఆ తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అనుమానాలు కలిగాయని జీవీఎల్ పేర్కొన్నారు.

అయితే రాజ్యాంగ పదవిలో ఉండేవారు రాజ్యాంగ స్ఫూర్తిని నిలపాల్సిన బాధ్యతను గుర్తించాలని,  రమేశ్ కుమార్ కూడా భవిష్యత్తులో అన్ని పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేస్తే బాగుంటుందని హితవు పలికారు.

More Telugu News