నేను ఆ రోజే చెప్పాను కదా!: హైకోర్టు తీర్పుపై సోమిరెడ్డి స్పందన

29-05-2020 Fri 13:28
  • రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలు సరికాదు
  • భంగపాటు తప్పదు
  • ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధం
  • అర్హత లేని కనగరాజ్ నియామకం కూడా అంతేనని నేను చెప్పాను 
somireddy fires on jagan

ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసిన విషయంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదని ఆయన విమర్శించారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని ఆయన చెప్పారు.

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు,అర్హత లేని కనగరాజ్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని తాను ఆ రోజే చెప్పానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైందనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. కాగా, ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఆ స్థానంలో కనగరాజ్‌ను నియమించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తిరిగి ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతలు నిర్వహించనున్నారు.