Akshay Kumar: బాలీవుడ్ హీరో సినిమాకి ఓటీటీ నుంచి 125 కోట్లు!

Lakshmi Bomb to be released through OTT
  • లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్'
  • అక్షయ్ కుమార్ సరసన కైరా అద్వానీ
  • లాక్ డౌన్ వల్ల విడుదలకు ఆటంకం
  • ఓటీటీ ప్లేయర్ ద్వారా విడుదలకు నిర్ణయం  
కరోనా భారత ఆర్థిక వ్యవస్థ మీద కొట్టిన దెబ్బ అంతాఇంతా కాదు. వినోదరంగమైన సినిమా రంగంపై కూడా ఈ దెబ్బ గట్టిగానే తగిలింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ చిత్ర రంగాలకు వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. పూర్తయిన సినిమాలు విడుదల కాకపోవడం.. షూటింగ్ మధ్యలో వున్న చిత్రాలు ఎక్కడివక్కడ ఆగిపోవడం వల్ల ఆయా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు.

ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా ఇప్పటికిప్పుడు థియేటర్లను తెరవడం జరిగే పనికాదు. ఒకవేళ థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో చాలామంది నిర్మాతలు తమ పూర్తయిన చిత్రాలను ఓటీటీ ప్లేయర్స్ ద్వారా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కైరా అద్వానీ జంటగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీబాంబ్' చిత్రం కూడా ఇలా ఓటీటీ ప్లాట్ ఫాంపై విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈమేరకు ఈ చిత్రం ఓటీటీ హక్కులను హాట్ స్టార్ సంస్థ 125 కోట్లకు దక్కించుకున్నట్టు ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ 'పింక్ విల్లా' పేర్కొంది. మామూలుగా ఈ స్థాయి చిత్రానికి డిజిటల్ ప్రసారం హక్కుల రూపంలో అరవై నుంచి డబ్బై కోట్లు వస్తుంటాయి. అయితే, థియేటరికల్ రిలీజ్ లేకపోవడం వల్ల దీనికి 125 కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు.

అయితే, లాక్ డౌన్ ఎత్తేసినా ఆ వెంటనే ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కావడం జరగదు. ఎందుకంటే, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి మరి కాస్త పని మిగిలివుందట. లాక్ డౌన్ తొలగించిన తర్వాత దానిని ప్రారంభించినా అది పూర్తవడానికి నెల రోజుల సమయం పడుతుందంటున్నారు. అందుకే, ఓటీటీ విడుదల తేదీని నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం.  
Akshay Kumar
Lawrence
Kaira Advani
Lakshmi Bomb

More Telugu News