స్టార్ బ్రదర్స్ కలిసి నటించనున్నారా?

29-05-2020 Fri 09:09
  • ఇంతవరకు కలిసి నటించని సూర్య, కార్తీ 
  • మలయాళం హిట్ ను రీమేక్ చేస్తున్న సూర్య
  • అన్నదమ్ములు కలిసి నటించే ఛాన్స్ 
  • తెలుగులో బాలయ్య, రానా నటించే అవకాశం 
Surya and Karthi act together

సూర్య, కార్తీ .. ఇద్దరూ స్టార్స్ .. ఇద్దరూ సొంత బ్రదర్స్!
ఇద్దరూ తమిళ హీరోలైనప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఇద్దరూ హీరోలై చాలా కాలమే అయినప్పటికీ ఇద్దరూ కలసి మాత్రం ఇంతవరకు ఒక్క సినిమాలోనూ నటించలేదు. వీరిద్దరూ కలసి ఎప్పుడు నటిస్తారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో వారికోసం ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

మలయాళంలో ఇటీవలి కాలంలో మంచి హిట్ అనిపించుకున్న 'అయ్యప్పనుమ్ కోషియం' తమిళ రీమేక్ లో ఈ అన్నదమ్ములిద్దరూ కలసి నటించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను ఇటీవలే సూర్య కొనుగోలు చేశాడట. తమ్ముడితో కలిసి ఇందులో నటించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే కనుక వీరి అభిమానులకు ఇక పండగే అని చెప్పచ్చు.

ఇదిలావుంచితే, ఈ మలయాళం చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి మరోపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ, రానాలతో దీనిని ఆయన రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.