ఆసుపత్రి నుంచి పరారై బస్సెక్కిన కరోనా రోగి.. కర్నూలులో కలకలం

29-05-2020 Fri 07:46
  • బుధవారం కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు
  • గురువారం వార్డు సిబ్బంది కన్నుగప్పి పరారీ
  • ఎట్టకేలకు పట్టుకుని తిరిగి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Corona Patient jump from Kurnool Hospital

మాత్రలు తెచ్చుకుంటానని చెప్పి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన కరోనా రోగి బస్సెక్కి పరారైన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. కరోనా రోగి బస్సెక్కిందన్న వార్త తెలియడంతో ప్రయాణికులు భయపడిపోయారు.

జిల్లాలోని ఆదోనికి చెందిన వృద్ధురాలు (65)కి కరోనా వైరస్ సోకడంతో ఆమెను బుధవారం రాత్రి కర్నూలు సర్వజన వైద్యశాలలో చేర్చారు. అయితే, గురువారం ఉదయం ఆమె మాత్రలు తెచ్చుకుని వస్తానని వార్డు సిబ్బందిని ఒప్పించి బయటకు వచ్చింది. అనంతరం ఆదోని వెళ్లే బస్సు ఎక్కేసింది.

విషయం తెలిసిన అధికారులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో అప్పటికే బయలుదేరిన బస్సును కోడుమూరులో ఆపి ఆమెను దించి తిరిగి ఆసుపత్రికి తరలించారు. తమతో పాటు కరోనా రోగి ప్రయాణించిందన్న విషయం తెలిసిన బస్సులోని 27 మంది ప్రయాణికులు భయంతో వణికిపోయారు. దీంతో అధికారులు వారిని బస్సు నుంచి దించి శానిటైజేషన్ కోసం బస్సును డిపోకు తరలించారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.