Lockdown: లాక్‌డౌన్ మరో రెండు వారాల పొడిగింపు.. ఆదివారం ప్రధాని ప్రకటన?

  • జూన్ 14 వరకు లాక్‌డౌన్ పెంపు యోచన
  • నియమ నిబంధనల విషయంలో రాష్ట్రాలకే అధికారం
  • సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలపై కొనసాగనున్న నిషేధం
Modi to announce 5th phase lockdown on Sunday

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నాలుగో విడత లాక్‌డౌన్‌ను మరోమారు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో లాక్‌డౌన్ ముగియనుండగా దానిని మరో రెండు వారాలు అంటే జూన్ 14 వరకు పొడిగిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆదివారం ప్రధాని నిర్వహించనున్న ‘మన్‌ కీ బాత్‌’లో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. నాలుగో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ఎక్కువ కావడం వల్ల దేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువైందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన మంత్రులు, నిపుణులు ఆ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఐదో విడత లాక్‌డౌన్‌ను ప్రకటిస్తే కనుక నియమ నిబంధనల విషయంలో అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే, పండుగలు, జాతరలు, సామూహిక ప్రార్థనలు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే కార్యక్రమాలను మాత్రం అనుమతించకూడదని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా హాళ్లు,  షాపింగ్‌ మాల్స్‌, బార్లు, పబ్బులతోపాటు విద్యాసంస్థలపై ఇప్పుడున్న నిషేధం అలానే కొనసాగే అవకాశం ఉంది. దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఇతర ప్రార్థనామందిరాలలో సాధారణ దైవ సంబంధ కార్యక్రమాలను పునఃప్రారంభించేందుకు కేంద్రం అనుమతించే అవకాశం ఉంది.

More Telugu News