Vodafone Idea: వొడాఫోన్ ఐడియాలో వాటా కొనుగోలు చేయనున్న గూగుల్

  • 5 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తున్న గూగుల్
  • తొలి దశలో ఉన్న చర్చలు
  • ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న గూగుల్
Google to buy stake in Vodafone Idea

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాలో వాటాను కొనుగోలు చేసేందుకు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆసక్తిని కనబరుస్తోంది. 5 శాతం వాటాను కొనుగోలు చేయాలని గూగుల్ భావిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఈ డీల్ కు సంబంధించిన ప్రక్రియ ఇంకా తొలి దశలోనే ఉందని చెప్పింది.

వాస్తవానికి జియోలో వాటాను కొనుగోలు చేసేందుకు తొలుత గూగుల్ ఆసక్తిని కనబరిచింది. అయితే, తన వైరి సంస్థ ఫేస్ బుక్ జియోలో వాటాను సొంతం చేసుకోవడంలో విజయవంతమైంది. మరోవైపు ఈ అంశంపై వొడాఫోన్, గూగుల్ రెండూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే, ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టే దిశగా గూగుల్ యోచిస్తున్నట్టు సమాచారం.

జియోలో రూ. 43,574 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గత నెలలో ఫేస్ బుక్ డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సిల్వర్ లేక్, విస్తా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా జియో సఫలీకృతమైంది. మరోవైపు, అబుదాబి స్టేట్ ఫండ్ కూడా జియోలో పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోంది.

More Telugu News