కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న డాక్టర్, నర్సు... ఫొటోలు వైరల్!

28-05-2020 Thu 20:22
  • ఉత్తర ఐర్లాండ్ అమ్మాయి, శ్రీలంక అబ్బాయి మధ్య ప్రేమ
  • ఏప్రిల్ లో పెళ్లి 
  • రెండ్రోజుల కిందట ఫొటోలు షేర్ చేసిన ఆసుపత్రి వర్గాలు
Doctor and Nurse gets married in Hospital

బ్రిటన్ లోనూ కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ డాక్టర్, నర్సు జంట ఆసుపత్రిలో ఉన్న ప్రార్థనామందిరంలోనే పెళ్లి చేసుకుంది. నర్సు పేరు జేన్ టిప్పింగ్ (34), డాక్టర్ పేరు అన్నలన్ నవరత్నం (30). జేన్ ఉత్తర ఐర్లాండ్ కు చెందిన అమ్మాయి కాగా, నవరత్నం శ్రీలంక జాతీయుడు. వీరిద్దరూ లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.

ప్రేమలో పడిన జేన్, నవరత్నం వాస్తవానికి ఆగస్టులో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా సంక్షోభం వీరిని మరింత ముందే పెళ్లి చేసుకునేలా పురిగొల్పింది. ఉత్తర ఐర్లాండ్, శ్రీలంక నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చేందుకు వీలుకాకపోవడంతో ఈ జోడీ ఏప్రిల్ లో తమ ఆసుపత్రిలోనే ఉన్న చర్చిలో పెళ్లితో ఒక్కటైంది. ఈ పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారా వీక్షించారు.

కాగా, ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సెయింట్ థామస్ ఆసుపత్రి వర్గాలు రెండ్రోజుల క్రితమే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం అందరికీ తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.