తిరుప్పూరులో వింత ధ్వనులు... ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన జనాలు!

28-05-2020 Thu 18:21
  • ఇటీవలే బెంగళూరులోనూ భారీ శబ్దాలు
  • తిరుప్పూరు ప్రజలకూ అలాంటి అనుభవమే ఎదురైన వైనం
  • తేజస్ యుద్ధ విమానమే అందుకు కారణమన్న అధికారులు
People in Tirupur frightens with mystery sounds

ఇటీవల మే 20న బెంగళూరు మహానగరం పరిసరాల్లో ఆకాశం నుంచి భీకర శబ్దాలు వెలువడడం అందరికీ తెలిసిందే. అయితే ఆ శబ్దం ఓ యుద్ధ విమానం నుంచి వచ్చిన 'సోనిక్ బూమ్' అని భారత వాయుసేన వెల్లడించింది. ఈసారి అలాంటి ధ్వనులే తమిళనాడులోని తిరుప్పూరు ప్రజలను హడలెత్తించాయి. తిరుప్పూరు, కంగేయం, పల్లాదం, అరుళ్ పురం, అవినాశిపాళయం, పొంగలూరు, కోండువై, అనుప్పరపాళయం ప్రాంతాల్లో ఈ తీవ్రస్థాయి ధ్వనులు వినిపించాయి. ఆకాశం బద్ధలైందా అనేంతగా పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లలోంచి బయటికి పరుగులుపెట్టారు.

దీనిపై జిల్లా అధికార యంత్రాంగం వివరణ ఇచ్చింది. భారత్ అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం తేజస్ ను సూలూర్ ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుంచి ప్రయోగాత్మకంగా నడిపి చూశారని, ఆ యుద్ధ విమానం సృష్టించిన ధ్వనులే ప్రజలను భయకంపితులను చేశాయని అధికారులు తెలిపారు.

తేజస్ యుద్ధ విమానాన్ని భారత్ దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది నాలుగో తరం సూపర్ సోనిక్ కంబాట్ ఎయిర్ క్రాఫ్టుల్లో అతి తేలికైన విమానం. ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించడం ద్వారా తేజస్ శత్రుదేశాల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకోగలదు. ఇది సూపర్ సోనిక్ వేగాన్ని అందుకునే సమయంలోనే ఆకాశం చిల్లులు పడేలా భారీ శబ్దాలు వినిపిస్తాయి. దీన్నే 'సోనిక్ బూమ్' అంటారు.