దీనికంతా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వమే కారణం: ఫడ్నవిస్

28-05-2020 Thu 17:48
  • మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సమయం మాకు లేదు
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పనులను మేము చేయం
  • కరోనా పెరుగుదలకు ఉద్ధవ్ ప్రభుత్వమే కారణం
Uddhav govt is responsible for corona spread says Fadnavis

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కానీ, రాష్ట్రపతి పాలన విధించడానికి కానీ తమకు అంత సమయం లేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ప్రస్తుతం కరోనాతో రాష్ట్రం సతమతమవుతోందని... ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పనులను తాము చేయమని చెప్పారు.

దేశంలో ఉన్న మొత్తం కరోనా రోగుల్లో 36 శాతం మహారాష్ట్రకు చెందిన వారేనని... దీనికంతా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ముంబైలో కరోనా బాధితులకు ఆసుపత్రులు, అంబులెన్సులు కూడా అందుబాటులో లేవని విమర్శించారు. రోడ్లపైనే రోగులు మరణిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఫడ్నవిస్ విమర్శించారు. ముంబై నగరంలో లాక్ డౌన్ ఉల్లంఘన జరుగుతోందని చెప్పారు. రేషన్ కార్డులున్న కోట్లాది మందికి మార్చి, ఏప్రిల్ మాసంలో రేషన్ లభించలేదని.. తిండి లేకపోవడంతో వారు రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు.