భోపాల్ నుంచి నలుగురు కుటుంబ సభ్యులను తరలించేందుకు ఎయిర్ బస్ ను బుక్ చేసిన సంపన్నుడు!

28-05-2020 Thu 16:03
  • ఢిల్లీ నుంచి ఖాళీగా భోపాల్ వచ్చిన విమానం
  • భోపాల్ నుంచి ఓ మహిళ, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలితో ఢిల్లీ పయనం
  • రూ.10 లక్షలు చెల్లించిన వ్యాపారవేత్త
Rich man booked a entire plane for his four family members

కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఆశ్చర్యం కలిగించే రీతిలో ఓ సంపన్నుడు తన నలుగురు కుటుంబ సభ్యులను భోపాల్ నుంచి తరలించేందుకు ఏకంగా ఎయిర్ బస్ విమానాన్ని బుక్ చేసుకున్నాడు. భోపాల్ నుంచి తన భార్య, ఇద్దరు పిల్లలు, ఓ వృద్ధురాలి కోసం ఎయిర్ బస్ ఏ320 విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఢిల్లీ నుంచి ఖాళీగా వచ్చిన ఆ 180 సీట్ల భారీ విమానం కేవలం నలుగురు ప్రయాణికులతో మళ్లీ ఢిల్లీ పయనమైంది. ఈ ప్రయాణం కోసం సదరు వ్యాపారవేత్త రూ.10 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది.

భారత్ లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో అనేకమంది సంపన్నులు అధిక రద్దీ ఉండే సాధారణ విమానాల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపడంలేదని, విమానం మొత్తం రిజర్వ్ చేసుకుంటున్నారని ఎయిర్ లైన్స్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం విమానాల ఇంధనం బాగా తగ్గడంతో విమానయాన సంస్థలు కూడా అద్దెలు తగ్గించాయని ఓ అధికారి వివరించారు.