కేసీఆర్ తో సినీ పెద్దల చర్చలపై బాలకృష్ణ కామెంట్.. క్లారిటీ ఇచ్చిన సి.కల్యాణ్!

28-05-2020 Thu 15:17
  • సినీ పెద్దల చర్చల గురించి తనకు తెలియదన్న బాలయ్య
  • చర్చనీయాంశంగా మారిన బాలయ్య వ్యాఖ్యలు
  • ఇండస్ట్రీలో గ్రూపులు లేవన్న సి.కల్యాణ్
C Kalyan gives clarity on Balakrishna comments

షూటింగులను పునఃప్రారంభించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో  సినీ పెద్దలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయం తనకు తెలియదంటూ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ లో సైతం దీనిపైనే చర్చ జరుగుతోంది. సినీ పరిశ్రమలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బాలయ్య వ్యాఖ్యలపై నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు.

షూటింగుల కోసం నిర్మాతలుగానే తాము ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని కల్యాణ్ తెలిపారు. బాలయ్య ప్రస్తుతం నిర్మాతగా ఏ చిత్రాన్ని చేయడం లేదని చెప్పారు. అవసరమైనప్పుడు మాత్రమే బాలయ్య తమతో చర్చల్లో పాల్గొంటారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని బాలయ్యకు తానే స్వయంగా చెప్పానని తెలిపారు. సినీ పరిశ్రమ అంతా ఒక్కటేనని... ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవని అన్నారు. ఎవరికి ఉండాల్సిన గౌరవం వారికి ఉంటుందని చెప్పారు.