ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన తెలుగు యువకుడి మృతి

28-05-2020 Thu 13:38
  • మలావీ వెళ్లిన భద్రాద్రి జిల్లా యువకుడు
  • కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన వైనం
  • పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి అనే యువకుడు దక్షిణాఫ్రికాలో మృత్యువాత పడ్డాడు. అతని వయసు 27 సంవత్సరాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఉపాధి కోసం మలావీ వెళ్లిన హర్షవర్ధన్ రెడ్డి అక్కడ ఓ ఉద్యోగంలో చేరాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. అతడ్ని స్నేహితులు ఆసుపత్రిలో చేర్చారు.

అనంతరం విషయాన్ని హర్షవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులకు తెలియజేశారు. దాంతో వారు తమ బిడ్డను భారత్ తీసుకొచ్చేందుకు సాయపడాలంటూ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును సంప్రదించగా, ఆయన వెంటనే చర్యలు తీసుకునేందుకు సంసిద్ధులయ్యారు. కానీ, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హర్షవర్ధన్ రెడ్డి బుధవారం ఆసుపత్రిలోనే మరణించాడు. ఈ వార్త విని అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.