రైలుకింద పడి ప్రియుడి ఆత్మహత్య.. గోదావరిలో దూకి ప్రియురాలి సూసైడ్!

28-05-2020 Thu 13:29
  • ఐదేళ్లుగా ప్రేమాయణం
  • చదువు మానేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్న అబ్బాయి
  • చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య?
  • మనస్తాపానికి గురైన అమ్మాయి
lovers suicide

ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ అమ్మాయి, అబ్బాయి చివరకు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్‌కు చెందిన మల్లిక, రామకృష్ణాపురానికి చెందిన సంతోష్‌ ఒకే జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. వారిద్దరి మధ్య ఆ సమయంలో స్నేహం చిగురించింది.

ఆ తర్వాత వారిద్దరు ఇంటర్ పాసై డిగ్రీలో చేరారు. అక్కడ వారి స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం వారిళ్లలో తెలిసిపోయింది. అయినప్పటికీ వారిని ఏమీ అనలేదు. అయితే, సంతోష్‌ కొన్ని నెలలుగా చదువు మానేసి ఇంట్లోనే ఉంటూ ఇతరులతో ఆన్ లైన్ గేమ్స్‌ ఆడుకుంటున్నాడు. గేమ్స్‌ కోసం అప్పులు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రియుడి మరణ వార్త విన్నప్పటి నుంచీ మల్లిక అతడి గురించే ఆలోచిస్తూ కూర్చుంది. ఆమె దిగాలుగా ఉంటుండడంతో పెద్దపల్లిలోని వారి బంధువుల ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆటోలో ఆమెను అక్కడికి తీసుకెళ్తుండగా, ఆ ఆటో ఇందారం గోదావరి బ్రిడ్జిపైకి చేరుకుంది. అంతే.. మల్లిక ఆటోలోంచి ఒక్కసారిగా గోదావరి నదిలో దూకేసి, మృతి చెందింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని బయటకు తీయించి కేసు నమోదు చేసుకున్నారు.