ఖర్చు చేసింది మూడో భాగమే... రైతులకు ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారా?: సోమిరెడ్డి

28-05-2020 Thu 13:19
  • వ్యవసాయ బడ్జెట్ వ్యయంపై సోమిరెడ్డి విసుర్లు
  • ఇప్పటివరకు రూ.6,548 కోట్లు ఖర్చు చేశారని వెల్లడి
  • రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం చెప్పుకుంటున్నారని విమర్శలు
Somireddy questions CM Jagan over Agriculture Budget expenditure

టీడీపీ మహానాడులో పాల్గొన్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ రంగానికి కేటాయింపులపై సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 2019-20 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగం బడ్జెట్ కేటాయింపులు రూ.18,328 కోట్లు అని ప్రకటించారని, కానీ ఖర్చు చేసింది రూ.6,548 కోట్లు మాత్రమేనని అన్నారు. అనుబంధ రంగాలకు రూ.1912 కోట్లు కేటాయించి, రూ.933 కోట్లే ఖర్చు చేశారని తెలిపారు. కేటాయించిన బడ్జెట్ లో మూడో భాగం మాత్రమే ఖర్చు చేశారని, కానీ, రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారని విమర్శించారు. రైతులకు ఎంతో చేశామని గొప్పలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రకటించిన బడ్జెట్ మొత్తం ఖర్చు చేయకుండా, ఆరేడు వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రాన్ని ఏడేళ్ల వెనక్కి తీసుకెళ్లారని అసంతృప్తి వ్యక్తం చేశారు.