పెళ్లికి వచ్చిన సీఐఎస్ఎఫ్ ఉద్యోగి... వధూవరులు సహా 100 మంది క్వారంటైన్!

28-05-2020 Thu 10:06
  • మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఘటన
  • సీఐఎస్ఎఫ్ లో పెరుగుతున్న కరోనా కేసులు  
  • మరుసటి రోజు పాజిటివ్ గా తేలడంతో క్వారంటైన్
New Couple Along 100 sent Quarantine

పెళ్లి జరిగిన గంటల వ్యవధిలో కొత్త జంట సహా దాదాపు 100 మందిని అధికారులు క్వారంటైన్ చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ ఘటన చింద్వారా జిల్లాలో జరిగింది. ఓ జంటకు వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించగా, రెండు రోజుల క్రితం జరిగిన ఆ పెళ్లికి వారి బంధువైన సీఐఎస్ఎఫ్ ఉద్యోగి ఒకరు హాజరయ్యారు.

పెళ్లి జరిగిన మరుసటి రోజు ఆయన కరోనా పాజిటివ్ గా తేలారు. గత వారంలో చింద్వారా - హోసంగాబాద్ జిల్లాల మధ్య సరిహద్దుల్లో విధులు నిర్వహించేందుకు సీఐఎస్ఎఫ్ బలగాలు వచ్చాయి. సీఐఎస్ఎఫ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, ముందు జాగ్రత్తగా వారి నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపారు. పెళ్లికి వచ్చిన సీఐఎస్ఎఫ్ ఉద్యోగికి కరోనా ఉన్నట్టు వివాహమైన మరుసటి రోజు తెలిసింది. ఆపై వెంటనే స్పందించిన అధికారులు అందరినీ క్వారంటైన్ చేశారు. అతని ద్వారా ఎవరికైనా కరోనా సోకిందా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు అందరినీ పరీక్షిస్తామని అధికారులు వెల్లడించారు.

ఈ విషయమై కలెక్టర్ సౌరభ్ సుమన్ స్పందిస్తూ, ప్రొటోకాల్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని, ఫస్ట్ కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగింది కాబట్టి, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇక్కడి లాల్ బాక్, ఏక్తా కాలనీ ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ప్రకటించామని వెల్లడించారు.