తనకు, అమిత్ షాకు మధ్య జరిగిన సంవాదనను వెల్లడించిన మమతా బెనర్జీ

28-05-2020 Thu 09:53
  • కరోనా విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబట్టిన మమత
  • కరోనా నివారణ చర్యలు కేంద్రమే చెపట్టవచ్చన్న మమత
  • ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదనలేమన్న అమిత్
Mamata Benarjee Revels What she told Amit Shah

పలు అంశాల్లో కేంద్రంతో విభేదించే మమతా బెనర్జీ, కరోనా వైరస్ చర్యల విషయంలోనూ కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న వేళ, అమిత్ షాకు, తనకూ మధ్య జరిగిన వాదనను ఆమె మీడియా సమావేశంలో బయటపెట్టారు.

"నేను అమిత్ షాకు స్పష్టంగా చెప్పాను. మీరు బెంగాల్ కు వరుసగా కేంద్ర బృందాలను పంపుతున్నారు. పంపించండి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన పనిని సక్రమంగా చేయడం లేదని భావిస్తే, కరోనా కష్టాల నివారణా చర్యలను మీరే చేపట్టండి. నాకేమీ సమస్య లేదు" అని అన్నట్టు ఆమె తెలిపారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి 28 రైళ్లలో వలస కార్మికులను పంపుతున్న రైల్వే శాఖపైనా ఆమె మండిపడ్డారు. బుధవారం నుంచి వలస కార్మికులను మోసుకు వచ్చే రైళ్లు భారీ సంఖ్యలో రాష్ట్రానికి వస్తున్నాయని, వారి వల్ల వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదముందని అన్నారు.

తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని కూడా అమిత్ షాను అడిగానని, "లేదు... లేదు... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని మేమెలా చేస్తాం?" అని ఆయన అన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని మమతా బెనర్జీ తెలిపారు. గత కొంత కాలంగా మహమ్మారి విజృంభణపై మమత, అమిత్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందంటూ అమిత్ షా ఓ లేఖను రాయగా, అది ఆమెకు చేరక ముందే మీడియాకు చేరడంతో, మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తానెప్పుడూ ఇతరులతో జరిగిన సంభాషణను బయట పెట్టేందుకు ఇష్టపడబోనని, కానీ ఈనాటి పరిస్థితి తనను మాట్లాడించిందని ఆమె వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని ఓ వైపు చెబుతూ, మరోవైపు రైళ్లను, విమానాలను కేంద్రం నడిపిస్తోందని, ఇక ప్రజల గతి ఏం కావాలని ఆమె మండిపడ్డారు.

"నేను ఒకటే విషయాన్ని ప్రధాన మంత్రికి, హోమ్ మంత్రికి చెప్పదలిచాను. కరోనా వ్యాపించకుండా దయచేసి చర్యలు తీసుకోండి. ఇప్పటికే కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. కొంతకాలం రాజకీయాలను పక్కన పెట్టండి. బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎంతో నష్టపోయాయి. ప్రతి చోటా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో నేనేం చేయగలను? పరిస్థితి మరింత దారుణం కాకముందే ప్రధాని కల్పించుకోవాలని కోరుతున్నాను" అని ఆమె అన్నారు.