ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం!: చంద్రబాబునాయుడు

28-05-2020 Thu 09:03
  • నేడు ఎన్టీఆర్ 97వ జయంతి
  • కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగ ధీరుడు 
  • ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. 
Chandrababu Tributes to NTR

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 97వ జయంతి ఉత్సవాల వేళ, చంద్రబాబునాయుడు ఆయన్ను ట్విట్టర్ వేదికగా తలచుకున్నారు. "ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగ ధీరుడు నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ  మార్గదర్శకం" అని అన్నారు.

ఆపై "ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం... తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. "సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ల"ని చాటుదాం" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.