అమెరికాలో నల్లజాతీయుడిపై పోలీసు కర్కశత్వం.. మెడపై కాలుతో తొక్కి పెట్టి చంపిన వైనం!

28-05-2020 Thu 08:03
  • తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా కాలుతీయని పోలీసధికారి 
  • సంకెళ్లు వేసినా మెడపైనా కాలు
  • సర్వత్ర ఆగ్రహావేశాలు.. నలుగురు పోలీసులపై వేటు
Four Minnesota police officers fired after death of black man

అమెరికాలో మరో దారుణం జరిగింది. ఓ ఆఫ్రికన్ అమెరికన్‌‌పై మిన్నెసొటా పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బాధితుడి మెడపై కాలుపెట్టి గట్టిగా అదిమిపెట్టిన పోలీసధికారి.. తనకు ఊపిరి ఆడడం లేదని బాధితుడు ఎంతగా చెప్పినా కనికరించలేదు. ఆ తర్వాత కాసేపటికే అతడు మరణించాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసినవారు అమెరికా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఓ ఫోర్జరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం రాత్రి జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఆఫ్రికన్ అమెరికన్ కారులో వెళ్తూ కనిపించాడు. వెంటనే కారును ఆపిన పోలీసులు అతడిని కిందికి దిగాల్సిందిగా ఆదేశించారు. బయటకు వచ్చిన వెంటనే అతడిని కిందికిపడేసి సంకెళ్లు వేశారు. ఈ క్రమంలో ఓ పోలీసు ఫ్లాయిడ్ మెడను కాలితో తొక్కిపెట్టాడు. దీంతో తనకు ఊపిరి ఆడడం లేదని, దయచేసి కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నాడు. అంతేకాదు పక్కనే ఉన్న వ్యక్తి కూడా ఫ్లాయిడ్ మెడపై కాలు తీయాలని కోరాడు.

అయినప్పటికీ ఆ పోలీసు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత కాసేపటికే ఫ్లాయిడ్‌లో చలనం ఆగిపోయింది. అయినా సరే ఏమాత్రం కనికరం చూపని ఆ పోలీసు కాలిని అలాగే అతడి మెడపై తొక్కిపెట్టి ఉంచాడు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకునే వరకు అతడు అలాగే తన కాలిని అతడి మెడపై ఉంచాడు. బాధితుడిని అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే జార్జ్ మరణించాడు. ఈ ఘటనపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించారు.