KCR: సడలింపులు ఇచ్చినా ఆదాయం పెరగలేదు.. ఏడాదికి రూ. 37,400 కోట్లను కిస్తీలుగా కట్టాలి: కేసీఆర్

  • రాష్ట్రానికి ఆదాయం పడిపోయింది
  • అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదు
  • 12 కిలోల బియ్యం ఈ నెల కూడా ఇస్తాం
State income not improved says KCR

లాక్ డౌన్ వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా... ఆదాయం పెరగలేదని చెప్పారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా లేదని తెలిపారు. ఏడాదికి రూ. 37,400 కోట్లను అప్పులకు కిస్తీలుగా కట్టాల్సి ఉందని.... అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందన లేదని చెప్పారు. ఎఫ్బీఆర్ఎం పరిమితిని పెంచినా... కేంద్రం విధించిన కారణాల వల్ల అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అప్పులపై వడ్డీలను యథావిధిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ చెప్పారు. పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఈ నెల కూడా ఇస్తామని చెప్పారు. లాక్ డౌన్ సడలింపుల వల్ల కూలీలు, కార్మికులకు మళ్లీ పని లభిస్తుందని అన్నారు.

కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ. 1500 ఇచ్చే కార్యక్రమం ఇకపై కొనసాగదని కేసీఆర్ చెప్పారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను కొనసాగించనున్నట్టు తెలిపారు.

More Telugu News