దేశభక్తుడైన కోహ్లీ.. దేశద్రోహి అయిన అనుష్కకు విడాకులు ఇవ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే

27-05-2020 Wed 20:45
  • అనుష్క ‘పాతాళ్‌లోక్’లో తన ఫొటో వాడడంపై ఎమ్మెల్యే గుర్రు
  • ఆ సినిమాను నిషేధించాలంటూ కేంద్రానికి లేఖ
  • అనుష్క సినిమాపై గూర్ఖాల మండిపాటు
BJP MLA nandkishor gurjar Fires on Anushka sharma

దేశ ద్రోహి అయిన అనుష్క శర్మకు దేశభక్తుడైన విరాట్ కోహ్లీ విడాకులు ఇవ్వాలని యూపీ బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనుష్కశర్మ నిర్మించిన వెబ్ సిరీస్ ‘పాతాళ్‌లోక్’లో అనుమతి లేకుండా తన ఫొటోను ఉపయోగించడంపై మండిపడిన నందకిశోర్ ఇప్పటికే అనుష్కశర్మపై కేసు పెట్టారు. అంతేకాదు, ఆ వెబ్‌సిరీస్‌ను నిషేధించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న అనుష్కపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్కడితో ఆగని ఎమ్మెల్యే.. అనుష్క దేశద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఎంతో దేశభక్తి ఉందని, దేశద్రోహి అయిన అనుష్కకు విడాకులు ఇవ్వాలని కోరారు. మరోవైపు, అనుష్క ‘పాతళ్‌లోక్‌’లో గూర్ఖా వర్గాన్ని కించపరిచే సంభాషణలున్నాయని ఆల్ అరుణాచల్‌ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ ఆరోపించింది. అనుష్కపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.