మెదక్ జిల్లాలో దారుణం.. బోరు వేసిన అరగంటకే బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి!

27-05-2020 Wed 19:49
  • బోరు వద్ద కేసింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం
  • ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్డీవో
  • ముమ్మరంగా కొనసాగుతున్న వెలికితీత ప్రయత్నాలు
Three Year old boy accidentally fell into borewell

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో ఘోరం జరిగింది. సాగు కోసం పంట పొలంలో బోరు వేసిన అరగంటలోనే మూడేళ్ల సాయివర్ధన్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీవో సాయిరాం, పాపన్నపేట పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాలుడిని వీలైనంత త్వరగా బావిలోంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరు వేసిన వెంటనే కేసింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.