బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు.. మళ్లీ మాదే అధికారం: కమల్‌నాథ్

27-05-2020 Wed 19:35
  • బీజేపీ నేతలు అధికారం చేపట్టినా తప్పుడు ప్రచారం ఆపడం లేదు
  • బీజేపీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
  • ఉప ఎన్నికల్లో విజయం మాదే
This is only interval says Kamal Nath

చేతికి అందిన అధికారం మూణ్ణాళ్ల ముచ్చటగా మారడంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విరామం ఇంటర్వెల్ మాత్రమేనని, రెట్టించిన ఉత్సాహంతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా రాబోయే ఉప ఎన్నికలపైనే ఉందని, ఈ ఎన్నికల్లో జరగనున్న 24 స్థానాల్లో 20 సీట్లను ఈజీగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

తాము బీజేపీలా కాదని, ఎమ్మెల్యేల బేరసారాలు తమకు చేతకాదని అన్నారు. ఇలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికారం విషయంలో తమకేమీ భయం లేదని, ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని కమల్‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అధికారం చేపట్టినా తమపై తప్పుడు ప్రచారం మాత్రం ఆపడం లేదని కమల్‌నాథ్ మండిపడ్డారు.