నడిరోడ్డుపై చితకబాదుతారా?.. నక్సలైట్‌కైనా ఇలాంటి ట్రీట్‌మెంట్ ఉంటుందా?: డాక్టర్ సుధాకర్ తల్లి

27-05-2020 Wed 18:39
  • మాస్కులు అడిగితే పిచ్చోడంటారా?
  • నా కుమారుడికి ప్రాణహాని ఉంది
  • నర్సీపట్నం ఎమ్మెల్యే కావాలనే ఇదంతా చేస్తున్నారు
Doctor Sudhakar mother warns AP Govt
ఆసుపత్రిలో తన కుమారుడికి అందిస్తున్న వైద్యంపై డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నక్సలైట్‌కు కూడా ఇలాంటి చికిత్స అందించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ డాక్టర్‌ను పట్టుకుని నడిరోడ్డుపై చితకబాదడమేంటి? అసలు ఇది ప్రభుత్వమేనా? అని ప్రశ్నించారు.

కేజీహెచ్‌కు తీసుకెళ్లిన రెండు గంటల్లోనే తన కుమారుడికి పిచ్చి అని నిర్ధారించారని, నర్సీపట్నం ఎమ్మెల్యే కావాలనే ఇలా చేస్తున్నారని కావేరీబాయి ఆరోపించారు. తాము చేతకాని వాళ్లం కాదని, సుప్రీంకోర్టులో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని అన్నారు.

మాస్కులు అడిగితే పిచ్చోడని ముద్ర వేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. దళితులను అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను వేరే ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. తమపై ప్రయోగాలు చేయవద్దని సీఎం జగన్‌ను కావేరీబాయి వేడుకున్నారు. సుధాకర్‌పై దాడిచేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు పెట్టాలని సుధాకర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సుధాకర్ కేసును వాదిస్తున్నందుకే లాయర్ శ్రావణ్‌కుమార్‌పై కేసు పెట్టారని అన్నారు.