లాక్‌డౌన్‌ విరహం.. ప్రియురాలి కోసం వేషం మార్చి కటకటాల్లోకి వెళ్లిన ప్రియుడు!

27-05-2020 Wed 18:12
  • గుజరాత్‌లోని సూరత్‌లో ఘటన
  • పంజాబ్ డ్రెస్, తలకు దుపట్టా, ముఖానికి మాస్క్‌తో పయనం
  • పోలీసుల అనుమాంతో కటకటాలపాలు
Man wear Girl dress to dupe police in Gujarat

ప్రేమికుల మధ్య లాక్‌డౌన్ ఎడబాటు పెంచింది. రెండు నెలలపాటు ప్రియురాలిని చూడకపోయే సరికి పిచ్చెక్కినట్టు అయింది. ఇంకా చూడకుండా ఉండడం తన వల్ల కాదనుకున్నాడు. ఆమెను ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అబ్బాయిలనైతే పోలీసులు పట్టుకుంటారని అనుమానించాడు. దీంతో అమ్మాయిలా మారిపోవాలనుకున్నాడు.

పంజాబీ డ్రెస్ ధరించి, తలకు దుపట్టా చుట్టుకున్నాడు. ఫేస్ మాస్క్ పెట్టుకుని బైక్‌పై నిన్న తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో రయ్‌మంటూ దూసుకుపోయాడు. ఓ ప్రాంతంలో పోలీసులు ఉన్నా అమ్మాయే అని భ్రమపడి అడ్డుకోలేదు. కానీ మరో ప్రాంతంలో మాత్రం దొరికిపోయాడు. అతడిని అడ్డుకున్న పోలీసులు వేళకాని వేళలో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించారు. అయితే, మాట్లాడితే దొరికిపోతానని భావించిన యువకుడు.. చేతితో సంజ్ఞలు చేశాడు.

దీంతో అనుమానించిన పోలీసులు దుపట్టా తీసి మాట్లాడాలని కోరారు. తప్పని పరిస్థితుల్లో దుపట్టా తీయడంతో అతడి బండారం బయటపడింది. పోలీసులు, అమ్మాయి తల్లిదండ్రులు తనను గుర్తించకుండా ఉండేందుకే ఇలా అమ్మాయి వేషం ధరించినట్టు చెప్పుకొచ్చాడు. విస్తుపోయిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిందీ ఘటన.