పాయలకుంటలో వైసీపీ వర్గీయుల బాహాబాహీ.. 8 మందికి గాయాలు

27-05-2020 Wed 16:34
  • కడప జిల్లా వైసీపీలో వర్గపోరు
  • గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన బద్వేలు ఎమ్మెల్యే
  • రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు
YCP Groups fight in Kadapa dist

కడప జిల్లా వైసీపీలో వర్గ పోరు రాజుకుంది. రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. నడిరోడ్డుపైనే ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కడప జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసేందుకు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామానికి చేరుకున్నారు.

అయితే, వేరే వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్‌రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.