ఆరోగ్యసేతు యాప్ చేసిన వ్యక్తి భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని దౌర్జన్యం చేశారు: చంద్రబాబు

27-05-2020 Wed 15:42
  • 70 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టును ఆపేశారు
  • అమరావతిని కొనసాగించి ఉంటే ఎన్నో ప్రాజెక్టులు వచ్చేవి
  • జగన్ పాలన మొత్తం అవినీతి, భూకబ్జాలే
Chandrababu fires on Jagan ruling in Mahanadu

వైసీపీ ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. 70 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టును ఆపేశారని మండిపడ్డారు. పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చి, కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చేందుకు తాము చేపట్టిన పనులను కూడా ఆపేశారని దుయ్యబట్టారు. అమరావతిని కొనసాగించి ఉంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. కృష్ణా-గోదావరి-పెన్నా ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేశారని తెలిపారు. మహానాడు సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాలన మొత్తం అవినీతిమయం, భూకబ్జాలేనని ఆరోపించారు. ఆరోగ్యసేతు యాప్ ను తయారు చేసిన విశాఖకు చెందిన వ్యక్తి భూమిని కాజేయాలని, పులివెందుల నుంచి వచ్చిన కొందరు చూశారని, తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయమంటూ దౌర్జన్యం చేశారని అన్నారు. ఆవ, రాజమండ్రి భూములు కబ్జా చేస్తున్నారని... గుడివాడలో 63 మంది భూములను ఇచ్చేయాలంటూ ఒక మంత్రి బలవంతం చేస్తున్నారని మండిపడ్డారు.

చివరకు ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా టీటీడీ భూములు అమ్మేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సింహాచలంలో భూములు కబ్జా చేశారని, విజయవాడ కనకదుర్గ గుడిలో అవినీతి జరిగిందని, బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటున్నారని విమర్శించారు. కరోనాపై కూడా జగన్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవా చేశారు.