చివరకు బ్లీచింగ్ పౌడర్ లో కూడా అవినీతికి పాల్పడ్డారు: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

27-05-2020 Wed 15:07
  • కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది
  • దారుణమైన మద్యం బ్రాండులను తీసుకొచ్చారు
  • విపక్ష నేతలపై దాడులు చేస్తున్నారు
YSRCP fraud in bleaching powder also says Chandrababu

వైసీపీ పాలనలో విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. చివరకు బ్లీచింగ్ పౌడర్ లో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని దారుణమైన మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని విమర్శించారు. మహానాడు సందర్బంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవని... ఆటవిక రాజ్యం కొనసాగుతోందని  అన్నారు. విశాఖలో కేంద్ర ఉద్యోగి ఒకరిని పులివెందుల రౌడీలు బెదిరిస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదని... వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ పెంచేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని అడిగారా? అని ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజావేదికను కూల్చడం నుంచి తాజాగా విజయనగరంలో మూడు లాంతర్లను కూల్చేంత వరకు కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. విపక్ష నేతలపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం చేస్తున్నారని దుయ్యబట్టారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిస్తే... తనను కూడా గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు.