అజ్ఞాతం వీడి.. పోలీసులకు లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్‌

27-05-2020 Wed 12:27
  • తహసీల్దార్ ను దూషించిన కేసులో టీడీపీ నేత 
  • వివిధ సెక్షన్ల కింద కేసులు
  • మూడు రోజులుగా అజ్ఞాతంలో రవికుమార్ 
  • నాయకులతో కలసి స్టేషన్ కు వచ్చిన కూన 
TDP leader Kuna Ravikumar surrenders to police

శ్రీకాకుళం టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ అజ్ఞాతాన్ని వీడారు. ఈ రోజు ఉదయం ఆయన టీడీపీ నాయకులు వెంటరాగా శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. పొందూరు తహసీల్దారు రామకృష్ణను దూషించిన కేసులో ఆయన నిందితుడు.

తనను అసభ్య పదజాలంతో రవికుమార్ దూషించి, బెదిరించారంటూ పోలీసులకు తహసీల్దారు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లేటప్పటికి ఆయన ఇంట్లో లేరు. ఈ క్రమంలో మూడు రోజులుగా ఆయన అజ్ఞాతంలో వున్నారు. పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్న నేపథ్యంలో రవికుమార్ ఈ రోజు పోలీసులకు స్వయంగా లొంగిపోవడం జరిగింది.