నానితో మరోసారి జతకట్టనున్న సాయిపల్లవి

27-05-2020 Wed 10:21
  • గతంలో 'ఎం.సి.ఏ' సినిమాలో నటించిన జంట 
  • నాని తాజా చిత్రంగా 'శ్యాం సింగ రాయ్'
  • కోల్ కతా వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్
Sai Pallavi to be cast opposite Nani

గతంలో 'ఎం.సి.ఏ' సినిమాలో కలసి నటించిన నాని, సాయిపల్లవి జంట మరోసారి జోడీ కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడు. దీనికి 'శ్యాం సింగ రాయ్' అనే టైటిల్ కూడా నిర్ణయించారు.

 ఇందులో కథానాయిక పాత్రలో సాయిపల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రం యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందనీ, పాత్ర ఆమెకు నచ్చిందనీ అంటున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉందనీ, అందుకే ఆమె ఒప్పుకోవచ్చనీ సమాచారం.

ఇదిలావుంచితే, ఈ చిత్రం పిరియాడిక్ కంటెంట్ తో సాగుతుందనీ, ఒకప్పటి కోల్ కతా నగరాన్ని తలపించే నేపథ్యం అవసరమనీ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం వీలుపడదు కాబట్టి ఆ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాదులో భారీ సెట్స్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సెట్స్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ వుంటుంది. ఇక ఇది నాని నటించే 27 వ చిత్రం అవుతుంది.