Corona Virus: లక్షన్నర దాటేసిన కరోనా కేసులు ... జూలై చివరకు 10 లక్షల కేసులు వస్తాయంటున్న నిపుణులు!

India Corona Toll Crossed One and Half Lakh
  • మొత్తం కేసులు 1.51,767కు చేరిక
  • వలస కార్మికులతో పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్
  • కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందన్న సీసీఎంబీ
ఇండియాలో కరోనా మహమ్మారి విస్తరణ శరవేగంగా సాగుతోంది. రోజుకు సగటున 6 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు కేసుల సంఖ్య 1.50 లక్షలను దాటింది. మంగళవారం సాయంత్రానికి అధికారికంగా 1.46 లక్షలకు పైగా కేసులు ఇండియాలో రిజిస్టర్ కాగా, ఈ ఉదయం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం కేసుల సంఖ్య 1.51,767కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 83004 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 4,337 మంది మరణించారని, 64,426 మంది చికిత్స తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదిలావుండగా, వలస కార్మికుల తరలింపుతో కరోనా వైరస్ పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించిందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న విధానాన్ని చూస్తే, జూలై నెలాఖరుకి కేసుల సంఖ్య 10 లక్షలకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇండియాలో వైరస్ సామూహిక వ్యాప్తి ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రారంభమైనట్టుగానే భావించవచ్చని సీసీఎంబీ వైరాలజీ నిపుణులు వ్యాఖ్యానించారు.

ఇండియాలో ప్రస్తుతం ప్రతి పది లక్షల మందిలో 1,744 కరోనా టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని, టెస్టుల సంఖ్యను పెంచితే, రోగుల సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించిన వైరాలజీ నిపుణులు, గ్రామాల్లో వైరస్ విస్తరణ ప్రారంభమైతే, రాష్ట్రాల పరిధిలో ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్న కేసుల పెరుగుదల వేలల్లోకి చేరిపోతుందని, ఆ పరిస్థితులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
Corona Virus
India
CCMB
New Cases
Migrents

More Telugu News