బీహార్ టెన్త్ పరీక్షల్లో కూరగాయల వ్యాపారి కుమారుడు టాపర్!

27-05-2020 Wed 07:51
  • 482 మార్కులు సాధించిన హిమాన్షు
  • రోజుకు 14 గంటలు చదివానని వెల్లడి
  • 80.59 శాతం ఉత్తీర్ణత నమోదైందన్న అధికారులు
Vegitable Seller son Himanshu Topper in Bihar Tenth Exams

బీహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 15.29 లక్షల మంది పరీక్షలకు హాజరుకాగా, 80.59 శాతం... అంటే 12.40 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు.

ఇక ఈ సంవత్సరం రోహ్ తాస్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి కుమారుడు హిమాన్షు రాజ్ టాపర్ గా నిలిచాడని పేర్కొన్నారు. తనౌజ్ లోని జనతా హైస్కూల్ లో విద్యను అభ్యసించిన హిమాన్షుకు 482 మార్కులు వచ్చాయని తెలిపారు. కాగా, తాను తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తూనే, రోజుకు 14 గంటల పాటు చదివానని, భవిష్యత్తులో ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని హిమాన్షు వ్యాఖ్యానించాడు.

చిన్నతనం నుంచే హిమాన్షు కష్టపడి చదివేవాడని, ఆటల్లోనూ సత్తా చాటేవాడని, అతని టీచర్ వ్యాఖ్యానించారు. ఇక తమ గ్రామానికి చెందిన బాలుడు, రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలవడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. పలువురు గ్రామస్థులు హిమాన్షు ఇంటికి వచ్చి మిఠాయిలు పంచారు.