Pakistan: పాకిస్థాన్ నుంచి రాజస్థాన్, మహారాష్ట్ర దాటి... తెలంగాణ వైపు దూసుకొస్తున్న మిడతల దండు!

Locusts Coming Towards Telangana
  • లక్షలాది ఎకరాల్లో పంటలు స్వాహా 
  • మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరిక
  • అత్యవసర సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ
  • రసాయనాలు సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచన

పాకిస్థాన్ నుంచి ఇండియాకు దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు, లక్షలాది ఎకరాల్లో పంటలను స్వాహా చేస్తూ, తెలంగాణ సమీపానికి రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఈ రాకాసి మిడతలు రాజస్థాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే, అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది.

దీంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.

ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తూ, చెట్లపై నివాసం ఉంటూ, పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వెల్లడించిన జనార్దన్ రెడ్డి, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి గ్రామంలో రసాయనాలను సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన పెంచి, చైతన్యవంతం చేయాలని అన్నారు.

మరోవైపు ఈ మిడతలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకూ విస్తరించాయి. తమ బరువుకు సమానమైన ఆహారాన్ని రోజూ లాగించే వీటిల్లో సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. జూన్ లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News