చనిపోయిన తండ్రి తనను హత్తుకున్నట్టు ఫీలైన రితేశ్ దేశ్ ముఖ్... వీడియో ఇదిగో!

26-05-2020 Tue 21:52
  • ఇవాళ మహారాష్ట్ర మాజీసీఎం విలాస్ రావు జయంతి
  • తండ్రి జ్ఞాపకాలతో భావోద్వేగాలకు గురైన రితేశ్
  • ఓదార్పు వచనాలు పలికిన ప్రముఖులు
Ritesh Deshmukh feels his father presence

తండ్రితో తన అనుబంధాన్ని హీరో రితేశ్ దేశ్ ముఖ్ అత్యంత వేదనా భరిత రీతిలో ప్రదర్శించారు. రితేశ్ తండ్రి, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావు దేశ్ ముఖ్ 2012లో మరణించారు. ఇవాళ ఆయన జయంతి కావడంతో రితేశ్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

దీనికి సంబంధించిన వీడియోని రితేశ్, తన భార్య జెనిలీయా సాయంతో టిక్ టాక్ వీడియో చేశాడు. తండ్రికి ఎంతో ఇష్టమైన కుర్తాలో ఓ చేయి ఉంచి, ఆ చేయిని తన తలపైనా, భుజంపైనా వేసుకుని తండ్రి స్వయంగా వచ్చి తనను హత్తుకున్నట్టుగా రితేశ్ ఫీలైన విధానం హృదయాలను మెలిపెడుతుంది. చనిపోయిన తండ్రి వచ్చి తనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నట్టు భావిస్తూ రితేశ్ భావోద్వేగాలతో తడిసి ముద్దయ్యారు.

దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ, నిన్ను ప్రతి రోజూ మిస్సవుతున్నాను నాన్నా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ స్పందించారు. ఈ వీడియో ట్వీట్ కు ప్రముఖుల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిషేక్ బచ్చన్, ప్రియా గుప్తా, మంచు లక్ష్మి, దేవిశ్రీ ప్రసాద్, హర్భజన్ సింగ్ వంటి సెలబ్రిటీలు రితేశ్ కు ఓదార్పు వచనాలు పలికారు.