అన్నం తినడు, నీళ్లు తాగడు... ఏడు దశాబ్దాల పాటు ఇలాగే బతికిన అద్భుత బాబా కన్నుమూత

26-05-2020 Tue 19:43
  • 70 ఏళ్లుగా అన్నం, నీళ్లు ముట్టని యోగి ప్రహ్లాద్
  • 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన యోగి
  • శాస్త్రవేత్తలకు సైతం అంతుబట్టని యోగి!
Yogi prahlad dies at the age of Ninety years

ఉత్తర భారతదేశంలో యోగి ప్రహ్లాద్ జానీ పేరు చెబితే అక్కడివాళ్లు ఎంతో భక్తి భావం ప్రదర్శిస్తారు. ఆయన ఎంత మాత్రం ఓ సాధారణ ఆధ్యాత్మికవేత్త  కాదు. 70 ఏళ్ల పాటు అన్నం, నీళ్లు లేకుండా జీవించడం యోగి ప్రహ్లాద్ కు మాత్రమే సాధ్యమైంది. అయితే ఇప్పుడాయన తుదిశ్వాస విడిచారు. గుజరాత్ లోని బనస్కంత ఆశ్రమంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. భక్తులు ఆయనను చునిర్వాలా మాతాజీ అని పిలుస్తారు. ఈయనలోని గొప్పదనం ఏమీ తినకుండానే జీవించడం.

అది గొప్పదనం అనడం కంటే సైన్స్ కు అందని మహాద్భుతం అంటే సరిపోతుంది. యోగి ప్రహ్లాద్ పై గతంలో అనేక ప్రయోగాలు కూడా జరిగాయి. అన్నపానాదులు లేకుండా ఎలా బతుకుతున్నాడంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆయనను నిశితంగా పరిశీలించి ఏమీ తేల్చలేకపోయారు. ఏదో శారీరక అసాధారణత అని మాత్రం చెప్పగలిగారు. 2010లో యోగి ప్రహ్లాద్ ను రెండు వారాల పాటు ఓ రూమ్ లో ఉంచి వీడియో కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఆపై అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి తేల్చిందేమిటంటే... యోగి ప్రహ్లాద్ కు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని జయించగల శక్తి ఉందని గుర్తించారు.

అంతెందుకు, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కూడా ఈ యోగి ఎలా బతుకుతున్నాడని ఎంతో ఆసక్తి చూపించినవాళ్లలో ఒకరు. యోగి మాత్రం తాను యోగధ్యానంతోనే జీవిస్తున్నానని సెలవిచ్చారు. ఇక, ప్రస్తుత విషయానికొస్తే, గురువారం నాడు బనస్కాంత ఆశ్రమంలోనే యోగి అంత్యక్రియలు జరగనున్నాయి. అప్పటివరకు భక్తుల సందర్శనార్థం ఆశ్రమంలోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు.